ధర్మానతో హెం మంత్రి చర్చలు

 హైదరాబాద్: మంత్రి పదవీకి రాజీనామా చేసిన ధర్మాన ప్రసాదరావును మంత్రులు బొత్స, సబితారెడ్డి, అహ్మదుల్లాలు కలిశారు. ధర్మానతో హెంశాఖ మంత్రి సబితారెడ్డి భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ధర్మాన ఎదుర్కొంటున్న అభియోగాలనే హెంశాఖ మంత్రి సబితా ఎదుర్కొటున్నారు. సబితకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ధర్మాన-సబితాల భేటీ జరిగింది. ఇరువురు అరగంటకు పైగానే సమావేశమైనట్లు సమాచారం. ఈ కేసుకు సంబంధించి భవిష్యత్ లో ఏర్పడే పరిణామాలకు సంబంధించి ఇద్దరి మధ్య చర్చ వచ్చి ఉండవచ్చనే ప్రచారం జోరుగా జరుగుతోంది. వాన్ పిక్ భూపందేరంలో సీబీఐ ధర్మానను ఐదో నిందితుడుగా పేర్కొంటూ చార్జిషీటు దాఖలు చేసిన విషయం విధితమే. దీనిపై తీవ్రమనస్తాపానికి గురైన ధర్మాన నిన్న రాత్రి సీఎంను కలిసి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు.  సీఎం కూడా రాజీనామా వద్దని వారించాడు. అయినప్పటికీ ధర్మాన వినకుండా సీఎంకు రాజీనామా లేఖను ఇచ్చి వచ్చారు. ఆయన నిన్నటి నుంచి గవర్నమెంటు వాహనాన్ని వాడటం లేదు. ఈ రోజు కూడా అధికారికంగా ఏ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాను కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను నమ్మిన వ్యక్తిననీ, తన వల్ల కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లడం ఇష్టం లేదంటూ రాజీనామా చేశారు. విలువలకు కట్టుబడి రాజీనామా చేసిన ధర్మానకు మద్దతుగా రాష్ర్ట కేబినెట్ లోని అనేక మంది మంత్రుల మద్దతు దొరుకుతోంది. రాజీనామా వల్ల నష్టమే కానీ, లాభం ఉండబోదనీ, తొందరపడి నిర్ణయం తీసుకోవద్దంటూ పీసీసీ చీఫ్ బొత్స, హెంశాఖ మంత్రి సబితారెడ్డి కలిసి కోరినట్లు తెలుస్తోంది. తాను ఏ తప్పు చేయలేదనీ, అయినప్పటికీ సీబీఐ చార్జిషీటులో తాను ఓ వ్యక్తికి వందల కోట్ల రూపాయలు లబ్దిచేకూరే విధంగా జీవోలు ఇచ్చినట్లు నిందితుని జాబితాలో పేర్కొనడం తన మనసును గాయపర్చినట్లు ధర్మాన తనను కలిసిన మంత్రులతో చెబుతూ బాధపడ్డట్టు తెలుస్తోంది. అభియోగాలు మోపిన తరువాత తాను ఆ పదవీలో ఎట్టి పరిస్థితుల్లో కొనసాగలేనంటూ తేల్చిచెప్పినట్లు సమాచారం. మొత్తానికి ధర్మాన రాజీనామా వ్యవహారం రాష్ర్ట కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వంలో పెను మార్పులను తెచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: